ఎన్నికలు జరపాలని ఎస్ఈసీని ఆదేశించలేము: ఏపీ హైకోర్టు

  • పరిషత్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని పిటిషన్లు
  • ఈ అంశంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు
  • తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించింది. పరిషత్ ఎన్నికలను నిర్వహించాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఈ అంశంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. మరోవైపు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

ఈ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులో ఎస్ఈసీగా నిమ్మగడ్డ పదవీ విరమణ చేస్తున్నారు. ఎన్నికలను నిర్వహించి వెళ్లిపోవాలని ఎస్ఈసీని వైసీపీ కోరుతోంది. వెంటనే ఎన్నికలను పూర్తి చేస్తే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపడతామని నిమ్మగడ్డను కలిసి చీఫ్ సెక్రటరీ విన్నవించారు.

మరోవైపు తమ ముందు హాజరు కావాలంటూ ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కూడా నిమ్మగడ్డకు నోటీసులు పంపింది. ఈ నోటీసులకు ఆయన సమాధానమిస్తూ... తాను కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నానని... ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇప్పటికిప్పుడే రాలేనని తెలిపారు.


More Telugu News