గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ‌‌ కాంగ్రెస్ నేత‌ల నిర‌స‌న‌

  • శాసనసభలో మాట్లాడేందుకు స‌మయం ఇవ్వట్లేదు
  • పోచారం శ్రీ‌నివాస‌రెడ్డికి  లేఖ ఇస్తాం
  • టీ విరామం సమయంలో స్పీకర్‌ను కలుస్తాం: భ‌ట్టి
తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. అయితే, శాస‌న‌స‌భ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వ తీరుపై కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ రోజు ఉద‌యం అసెంబ్లీ స‌మీపంలోని గన్‌పార్క్‌ వద్ద కాంగ్రెస్ నేత‌లు నల్లకండువాలతో నిరసన తెలిపారు. శాసనసభలో మాట్లాడేందుకు తమకు ప్ర‌భుత్వం సమయం ఇవ్వడం లేదని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంత‌రం అసెంబ్లీకి వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. శాస‌న‌ సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోచారం శ్రీ‌నివాస‌రెడ్డికి  లేఖ ఇస్తామని  తెలిపారు. ఈ మేర‌కు ఈ రోజు టీ విరామం సమయంలో స్పీకర్‌ను కలుస్తామని చెప్పారు.

నిన్న సభలో త‌మ‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని వివ‌రించారు. శాసనసభలో నేటి నుంచి ప‌ద్దులపై చర్చ జరగనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ పై సాధారణ చర్చలు నిన్నటితో ముగిశాయి. నేడు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లుతో పాటు వాణిజ్య పన్నులు, బలహీనవర్గాల గృహ నిర్మాణాల‌పై చర్చ జ‌ర‌గ‌నుంది.  


More Telugu News