కబడ్డీ పోటీల్లో అపశ్రుతిపై గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి

  • క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థన
  • మెరుగైన చికిత్స అందించాలంటూ అధికారులకు ఆదేశం
  • బాధితులను పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేటలో జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా గ్యాలరీ కూలిన ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలో సామర్థ్యానికి మించి కూర్చోవడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 150 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో సుమారు 1500 మంది ప్రేక్షకులు ఉన్నట్టు గుర్తించారు.

ప్రమాదంలో గాయపడినవారంతా త్వరగా కోలుకోవాలని గవర్నర్ ప్రార్థించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ ఘటన దురదృష్టకరమని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామన్నారు. ఘటనపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రితోపాటు ఎమ్మెల్యేలు లింగయ్య, సైదిరెడ్డి తదితరులు పరామర్శించారు.

సూర్యాపేట ఘటనపై రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


More Telugu News