వన్డేల్లో మాత్రం వాళ్లిద్దరే ఓపెనర్లు: విరాట్ కోహ్లీ

  • ఇంగ్లండ్ తో ఐదో టీ20లో ఓపెనర్ గా వచ్చిన కోహ్లీ
  • కోహ్లీ ఓపెనర్ గా కొనసాగాలంటున్న క్రికెట్ పండితులు
  • వన్డేల్లో రోహిత్, ధావన్ ఓపెనింగ్ చేస్తారని వెల్లడి
  • ప్రథమ ప్రాధాన్యత వాళ్లకేనని స్పష్టీకరణ
ఇంగ్లండ్ తో చివరి టీ20లో ఓపెనర్ గా బరిలో దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరవిహారం చేయడం తెలిసిందే. దాంతో కోహ్లీ ఓపెనర్ గా బరిలో దిగాలనే వారి సంఖ్య పెరిగింది. దీనిపై కోహ్లీ స్పందించాడు. వన్డేల్లో మాత్రం రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనర్లని స్పష్టం చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో తొలి ప్రాధాన్యత వారిద్దరికేనని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ తో ఈ నెల 23 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మకు జోడీగా ఎవరు ఓపెనింగ్ కు వస్తారన్న చర్చకు కోహ్లీ తెరదించాడు.

గత కొన్నేళ్లుగా రోహిత్, ధావన్ జోడీ విశేషంగా రాణించిందని, ఇకపైనా వాళ్లిద్దరే ఓపెనర్లని తేల్చి చెప్పాడు. టీ20లో రోహిత్ తో జోడీగా బరిలో దిగారు కదా అనే ప్రశ్నకు బదులిస్తూ... మున్ముందు కూడా అది కొనసాగుతుందని కచ్చితంగా చెప్పలేమని అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కు బ్యాటింగ్ ఆర్డర్ లో స్థానం కల్పించేందుకే తాను ఓపెనర్ గా బరిలో దిగానని వివరించాడు.


More Telugu News