జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలకు మెగా బ్రదర్స్ అభినందనలు

  • 67వ నేషనల్ ఫిలిం అవార్డులు ప్రకటించిన కేంద్రం
  • తెలుగులో జెర్సీ, మహర్షి చిత్రాలకు పురస్కారం
  • తన సన్నిహితులకు అవార్డులు వచ్చాయంటూ చిరంజీవి హర్షం
  • మరిన్ని మంచి చిత్రాలు తీయాలన్న పవన్ కల్యాణ్
కేంద్రం 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగులో జెర్సీ, మహర్షి చిత్రాలు జాతీయ అవార్డులకు ఎంపికయ్యాయి. పలు భాషలకు చెందిన చిత్రాలు వివిధ కేటగిరీల్లో పురస్కారాలు పొందాయి. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు.

"67వ జాతీయ ఫిలిం అవార్డుల విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈసారి అవార్డుల జాబితాలో తెలుగు, తమిళం, మలయాళ సినీ రంగాలకు చెందిన కొందరు సన్నిహితులు ఉండడం సంతోషం కలిగిస్తోంది. మంచి సినిమా వర్ధిల్లాలి" అంటూ చిరంజీవి పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ స్పందిస్తూ... తెలుగు సినీ రంగం నుంచి మహర్షి, జెర్సీ చిత్రాలు జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నిలిచిన మహర్షి చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరో మహేశ్ బాబుకు అభినందనలు అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే చిత్రానికి గాను రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ఎంపిక కావడం ఆనందకరమని తెలిపారు.

ఇక, ఉత్తమచిత్రంగా నిలిచిన జెర్సీ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, హీరో నానీలకు అభినందనలు తెలిపారు. ఇదే చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్ ఎంపికవడం అభినందనీయమని పవన్ పేర్కొన్నారు. జాతీయ అవార్డులు ఇచ్చిన స్ఫూర్తితో మహర్షి, జెర్సీ చిత్రాల దర్శకులు, నిర్మాతలు ప్రేక్షకులను మెప్పించే మంచి చిత్రాలను మరెన్నో అందించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.


More Telugu News