భారత రాజకీయాల్లో బయటి వ్యక్తులంటూ ఉండరు: కమలహాసన్‌

  • కమల్‌ను అతిథిగా అభివర్ణించిన కోయంబత్తూర్‌ బీజేపీ అభ్యర్థి శ్రీనివాసన్‌
  • కొట్టిపారేసిన ఎంఎన్‌ఎం చీఫ్‌ కమలహాసన్‌
  • హంగ్‌ వస్తే ఎవరికి మద్దతు ఇస్తారని విలేకరుల ప్రశ్న
  • రెండు ప్రధాన పార్టీలకు అర్హత లేదన్న కమల్‌
  • పేదల ఉన్నతి కోసమే పోటీ చేస్తున్నానన్న ఎంఎన్‌ఎం చీఫ్‌
భారత రాజకీయాల్లో ‘బయటి వ్యక్తి’ అన్న పదమే ఉండదని.. అలాంటి వ్యాఖ్యలు చేయడం నిర్హేతుకమని మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమలహాసన్‌ అన్నారు. పరోక్షంగా కోయంబత్తూర్‌ నియోజకవర్గం నుంచి తనకు పోటీగా బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్‌ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా ఇటీవల శ్రీనివాసన్ మాట్లాడుతూ.. కమలహాసన్‌ ను కోయంబత్తూర్‌కు అతిథిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించే తాజాగా కమల్‌ హాసన్‌ స్పందించారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్‌ వస్తే ఏ పార్టీకి మద్దతిస్తారని కమల్‌ను ప్రశ్నించగా.. డీఎంకే, అన్నాడీఎంకే రెండింటికీ అర్హత లేదని వ్యాఖ్యానించారు. అందుకే, ప్రజలు స్వచ్ఛమైన రాజకీయాలను ఎన్నుకునే దిశగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం తాను పనిచేయాలనుకుంటున్నానని.. అందుకే ఎన్నికల్లో గెలిచి రాజ్యాంగపరంగా సేవ చేసే హక్కు సాధించాలనుకుంటున్నానన్నారు.  

అవినీతికి పాల్పడిన అన్నాడీఎంకే ప్రభుత్వంలోని మంత్రులను వెంటనే జైలుకు పంపాలని కమల్ అన్నారు. ఈ విషయంలో పోలీసులు యాక్టివ్‌గా పనిచేయాలని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా అనినీతిని అరికట్టే ఉద్దేశంతో రాష్ట్రంలో తనిఖీలు నిర్వహించాలని వ్యాఖ్యానించారు.

తమిళనాడులో ఏప్రిల్‌ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 స్థానాలుండగా.. ఎంఎన్‌ఎం 154 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 80 సీట్లలో ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న ‘ఆల్‌ ఇండియా సమతువ మక్కల్ కచ్చి’, ‘ఇంధియ జననయగ కచ్చి’ చెరో 40 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.


More Telugu News