పురుషుల కంటే మహిళలు శక్తిమంతమైనవారు.. కేరళ పర్యటనలో రాహుల్‌ గాంధీ

  • రెండు రోజుల కేరళ పర్యటనలో ఉన్న మోదీ
  • మహిళలకు తమ శక్తి తెలియక మోసపోతారని వ్యాఖ్య
  • విద్యార్థినులకు స్వీయరక్షణ టెక్నిక్‌ నేర్పిన రాహుల్‌
  • మహిళలు తమలోని శక్తిని వెలికితీయాలని పిలుపు
పురుషుల కంటే మహిళలు చాలా శక్తిమంతమైనవారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కానీ, వారికి తమ శక్తి ఎంతటిదో తెలియక మగవారి చేతిలో మోసపోతుంటారని అభిప్రాయపడ్డారు. కొచ్చిలోని సెయింట్‌ థెరీసా కాలేజ్‌ ఫర్‌ వుమెన్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు.

ఏప్రిల్‌ 6న కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచారం నిమిత్తం రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రస్తుతం కేరళలో ఉన్నారు. నేడు తమ ప్రసంగంతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా కాలేజీ అధ్యాపకుల కోరిక మేరకు మహిళల స్వీయరక్షణ కోసం ఉపయోగపడే ఓ మార్షల్‌ ఆర్ట్‌ టెక్నిక్‌ను రాహుల్‌ విద్యార్థినులకు నేర్పించారు. ఆ విధానంలో శక్తిని కూడగట్టుకున్నట్లుగానే మహిళలు ఎల్లప్పుడూ తమలోని నిగూఢ శక్తిని వెలికితీయాలని పిలుపునిచ్చారు.

ఈ సమాజం మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. తమ శక్తితో ఎదురవుతున్న ప్రతి సవాల్‌ను దీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. సమాజంలో పురుషులు, మహిళలు సమానమని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో రాహుల్‌ విభేదించారు.


More Telugu News