ఏపీ నూతన ఇసుక విధానంతో ప్రజలకు లబ్ధి: గోపాలకృష్ణ ద్వివేది

  • ఓ ప్రైవేటు సంస్థకు ఏపీలో ఇసుక తవ్వకాల బాధ్యత
  • ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
  • వివరణ ఇచ్చిన పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి
  • టెండర్ విధానం పారదర్శకంగా జరిగిందని వెల్లడి
ఏపీలో ఇసుక తవ్వకాలు, రీచ్ ల నిర్వహణ, అమ్మకాలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించడం విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వివరణ ఇచ్చారు. ఇసుక తవ్వకాలపై ఏడు సంస్థలను సంప్రదించామని, అయితే ఇసుక తవ్వకాలకు ఆయా సంస్థలు ముందుకు రాలేదని పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ కోసం జనవరి 4న ఎంఎస్ టీసీతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఇసుక టెండర్ విధానం పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు.

నూతన ఇసుక విధానంతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ప్రజలు ఏ రీచ్ నుంచైనా ఇసుక తీసుకువెళ్లొచ్చని వెల్లడించారు. ప్రజలు తమ సొంత వాహనాల్లోనూ ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు ఉందని స్పష్టం చేశారు. నాణ్యతను పరిశీలించి తమకు నచ్చినచోట ఇసుక తీసుకెళ్లొచ్చని ద్వివేది వివరించారు. ప్రభుత్వ నూతన విధానం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్ లలోనూ ఒకే ధర అమలు చేస్తున్నామని చెప్పారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా ఇసుక కొనుగోళ్లు జరుపుకోవచ్చని పేర్కొన్నారు.


More Telugu News