ఎమ్మెల్సీ సతీశ్ కు కరోనా పాజిటివ్‌.. శాసనమండలిలో కలకలం

  • తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
  • సతీశ్ కు కరోనా సోకడంతో ఆందోళనలో ఎమ్మెల్సీలు
  • అసెంబ్లీ సమావేశాలు ముందుగానే ముగిసే అవకాశం
తెలంగాణలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 337 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన స్వయంగా తెలియజేశారు.

ర్యాపిడ్ టెస్టులో నెగెటివ్ రాగా... ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. గత ఐదు రోజులుగా తనతో ప్రైమరీ కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, హోమ్ ఐసొలేషన్ లో ఉండాలని ఆయన కోరారు.

మరోవైపు పురాణం సతీశ్ కు కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే శాసనమండలి సభ్యుల్లో కలవరం మొదలైంది. శనివారం ఆయన మండలి సమావేశాలకు హాజరయ్యారు. దీంతో, ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

మరోపక్క, కరోనా నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ముందుగానే ముగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా రేపో, ఎల్లుండో సమావేశాలను ముగించే అవకాశం ఉంది.


More Telugu News