ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు: మంత్రి ఆదిమూలపు సురేశ్

  • ఉదయం 7.45 నుంచి 11.30 వరకు క్లాసులు
  • ఆపై మధ్యాహ్న భోజనం
  • 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు
  • ఎండలు, కరోనాను దృష్టిలో ఉంచుకున్నామన్న మంత్రి
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీలో ఒంటిపూట బడుల షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరాలు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఉదయం 7.45 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు జరుగుతాయని వివరించారు. ఆపై మధ్యాహ్న భోజనం ఉంటుందని చెప్పారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ మేరకు ఒక్కపూట బడులు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

ఓవైపు ఎండలు తీవ్రమవుతుండడం, మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు నిర్ణయించామని పేర్కొన్నారు. కాగా, ఒంటిపూట బడుల నేపథ్యంలో పాఠశాల నుంచి విద్యార్థులను క్షేమంగా ఇళ్లకు చేర్చడంపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులకు మంత్రి ఆదిమూలపు ఆదేశాలు జారీ చేశారు.


More Telugu News