ప్రపంచవ్యాప్తంగా 27 లక్షల మందిని బలితీసుకున్న కరోనా మహమ్మారి

  • గణాంకాలు విడుదల చేసిన జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ
  • ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 12,28,12,281 మందికి సంక్రమించిన వైరస్
  • ఒక్క అమెరికాలోనే 5,41,907 మంది మృత్యువాత
ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 27,09,627 మందిని బలితీసుకుందని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్ తెలిపింది. అలాగే, కరోనా బారినపడిన వారి సంఖ్య 12,28,12,281కి చేరుకుందని అది విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఒక్క అమెరికాలోనే ఇప్పటి వరకు 5,41,907 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. అలాగే, 2,97,80,301  మంది  కరోనా బాధితులుగా మారారు. తాజాగా, గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 8,177 మంది మృత్యువాత పడ్డారు.

మరోవైపు, కరోనా మహమ్మారి భారత్‌లో మరోమారు విజృంభిస్తోంది. దీంతో అప్రమత్తమైన పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. విద్యాసంస్థలు, పబ్‌లు, రెస్టారెంట్లు తిరిగి మూసివేశాయి. నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. వైరస్ రెండోసారి విజృంభిస్తుండడంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు.


More Telugu News