మా పార్టీ అభ్యర్థికి వైసీపీ రూ.30 లక్షలు ఇవ్వజూపింది: సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు

  • తిరుపతి 26వ డివిజన్‌లో 5 వేల మంది ఓటర్లకు డబ్బులు పంచింది
  • పైసా ఇవ్వకున్నా మాకు 300 ఓట్లు వచ్చాయి
  • వలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది
  • ప్రతి నెలా రూ. 310 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేస్తోంది
అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుపతి మునిసిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి రూ. 30 లక్షల ఆశ చూపి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి 26వ డివిజన్‌లో మొత్తం 6 వేల మంది ఓట్లు ఉంటే 5 వేల మందికి రూ. 500 చొప్పున పంపిణీ చేసిందని ఆరోపించారు. ఇక్కడ వైసీపీకి వచ్చిన 1500 ఓట్లలో 300 దొంగ ఓట్లేనని అన్నారు. పైసా కూడా పంచని తమకు 300 ఓట్లు వచ్చాయన్నారు. పథకాలను నిలిపివేస్తామని ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో విజయం సాధించిందని వీర్రాజు ఆరోపించారు.

వలంటీర్ల వ్యవస్థ కోసం నెలకు రూ. 310 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. వలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, కాబట్టి తిరుపతి ఉప ఎన్నిక పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించాలని కేంద్రాన్ని కోరారు. తాము కనుక అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలను పేదలకు అందించేందుకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 2 వేల మంది కార్యకర్తలను నియమిస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు.


More Telugu News