అసోం వరద పీడితుల పట్ల బాధ పడలేదు కానీ, 22 ఏళ్ల అమ్మాయి ట్వీట్ కు బాధపడ్డారట: మోదీపై ప్రియాంక విసుర్లు

  • అసోంలో అసెంబ్లీ ఎన్నికలు
  • ప్రచార పర్వంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
  • మోదీ ప్రసంగాన్ని తప్పుబట్టిన ప్రియాంక
  • అసోం ప్రజల కష్టాలపై మోదీ మౌనంగా ఉన్నారని ఆరోపణ
అసోం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏకంగా బీజేపీ అగ్రనేతలనే టార్గెట్ చేస్తూ ప్రియాంక ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. జోర్హాట్ లో ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. అసోంలో వరదలకు ప్రజలు విలవిల్లాడితే బాధపడని వ్యక్తి, 22 ఏళ్ల అమ్మాయి టూల్ కిట్ పై చేసిన ట్వీట్ కు బాధపడ్డాడని విమర్శించారు. అసోం వరద గుప్పిట్లో చిక్కుకుని అస్తవ్యస్తం అయితే మోదీ మౌనంగా ఉన్నారని ఆరోపించారు.

"నిన్న ప్రధాని ప్రసంగాన్ని విన్నాను. ఓ పరిణామంపై తాను తీవ్ర విచారానికి గురయ్యానని ఆయన చెప్పారు. వాస్తవానికి అసోం అభివృద్ధి గురించి ప్రధాని ఏమైనా మాట్లాడతాడని, లేక అసోంలో బీజేపీ గురించి మాట్లాడతాడని ఆశించాను. కానీ టూల్ కిట్ (దిశా రవి) వ్యవహారంపై ఆయన మాట్లాడడం దిగ్భ్రాంతి కలిగించింది" అని ప్రియాంక వివరించారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమం కారణంగా అసోం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మోదీ ఎందుకు బాధపడలేదని ప్రశ్నించారు. ఆ అల్లర్లలో ఐదుగురు మరణించినప్పుడు మోదీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.


More Telugu News