హైదరాబాదు పాతబస్తీలో కరోనా కలకలం... అమ్మాయిల వసతిగృహంలో 9 మందికి పాజిటివ్

  • తెలంగాణలో ఇటీవలే విద్యాసంస్థల పునఃప్రారంభం
  • కరోనా బారినపడుతున్న విద్యార్థులు
  • వసతిగృహాల్లో కరోనా వ్యాప్తి
  • విద్యాసంస్థల మూసివేతపై నిర్ణయం తీసుకునే అవకాశం
హైదరాబాదులోని పలు విద్యాసంస్థలు, వసతిగృహాల్లో కరోనా వ్యాప్తి మరింత అధికమైంది. తాజాగా పాతబస్తీలోని ఓ బీసీ హాస్టల్లో కరోనా కలకలం రేగింది. రాజన్నబావి బాలికల వసతిగృహంలో 9 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ హాస్టల్లో 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా బారినపడిన బాలికలను ఐసోలేషన్ లో ఉంచారు. వారికి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటికే నగరంలోని పలు వసతిగృహాల్లో కరోనా ప్రబలడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవలే విద్యాసంస్థలు పునఃప్రారంభం కాగా, స్కూళ్లు, కాలేజీలు, విద్యార్థుల వసతి గృహాల్లో కరోనా వ్యాప్తి మరింత అధికమైంది. దాంతో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులను పై తరగతులకు నేరుగా ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. కాగా, కొత్త కేసులు మరింత పెరుగుతుండడంతో ఇతర విద్యాసంస్థలు మూసివేతపైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ దీనిపై ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.

అటు, పాక్షికంగా లాక్ డౌన్ విధించేందుకు కూడా సర్కారు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. షాపింగ్ మాళ్లు, సినిమా థియేటర్ల వద్ద ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. వారాంతపు దినాలు శని, ఆదివారాల్లో లాక్ డౌన్ విధించడంపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.


More Telugu News