హిరేన్ మన్సూఖ్ మృతి కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏటీఎస్ పోలీసులు

  • అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలతో వాహనం
  • అనుమానాస్పద స్థితిలో హీరేన్ మన్సూఖ్ మృతి
  • దర్యాప్తు చేస్తున్న ఏటీఎస్ పోలీసులు
  • మాజీ కానిస్టేబుల్, బుకీ అరెస్ట్
ముంబయిలో ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల నిలిపివేత వ్యవహారంలో హీరేన్ మన్సూఖ్ అనే ఆటోమొబైల్ వ్యాపారి మృతి మరిన్ని అనుమానాలకు దారితీసింది. అంబానీ ఇంటివద్ద వాహనాన్ని గుర్తించిన కొన్నిరోజులకే హీరేన్ మన్సూఖ్ అనుమానాస్పద పరిస్థితుల్లో శవమై తేలాడు. మన్సూఖ్ కేసులో దర్యాప్తు చేస్తున్న యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేశారు.

మాజీ కానిస్టేబుల్ వినాయక్ షిండే (55), బుకీ నరేశ్ లను అరెస్ట్ చేసినట్టు ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. ఈ కేసుతో సంబంధం ఉందని భావించి తొలుత వీరిద్దరినీ ఏటీఎస్ ప్రధాన కార్యాలయానికి విచారణ నిమిత్తం పిలిపించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేశారు. మాజీ కానిస్టేబుల్ షిండే ఓ నకిలీ కాల్పుల ఘటనలో దోషిగా తేలాడు. ప్రస్తుతం పెరోల్ పై బయట ఉన్నాడు.

అంబానీ ఇంటి వద్ద నిలిపిన ఎస్ యూవీ హిరేన్ మన్సూఖ్ ది కాగా, ఫిబ్రవరి 17న తన వాహనం పోయిందని మన్సూఖ్ ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ వ్యవహారంలో సూత్రధారిగా భావిస్తున్న మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ఆ వాహనాన్ని 4 నెలల కాలానికి బాడుగకు తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు, తన భర్త మరణానికి వాజేనే కారణమని మన్సూఖ్ భార్య ఆరోపిస్తోంది.


More Telugu News