అదృశ్యమైన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు ఉద్యోగాలిప్పిస్తానని లక్షలు వసూలు చేశాడు: విశాఖ ఏసీపీ

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు అదృశ్యం
  • సూసైడ్ నోట్ రాయడంతో సర్వత్రా ఆందోళన
  • ఫర్నేస్ లో దూకి ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదన్న ఏసీపీ
  • ఇద్దరి నుంచి రూ.50 లక్షలు తీసుకున్నాడన్న వెల్లడి
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ రాసి అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపగా, పోలీసులు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. ఆ లేఖలో శ్రీనివాసరావు తాను స్టీల్ ప్లాంట్ ఫర్నేస్ లో దూకి ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడని, కానీ ఫర్నేస్ లో మనిషి దూకేందుకు అవకాశం లేదని ప్లాంట్ వర్గాలు తెలిపాయని విశాఖ ఏసీపీ మీడియాకు వెల్లడించారు. శ్రీనివాసరావు అదృశ్యంపై మీడియా సమావేశం నిర్వహించిన ఏసీపీ మాట్లాడుతూ... అతని కాల్ లిస్టు పరిశీలిస్తే, అతను పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేసిన విషయం వెల్లడైందని అన్నారు. శ్రీనివాసరావు పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు.

ఆచూకీ లేకుండా పోవడానికి ముందు శుక్రవారం రాత్రి శ్రీనివాసరావు విధులకు హాజరయ్యాడని, రాత్రి 10 గంటలకు వచ్చి ఉదయం 6.30 గంటలకు వెళ్లిపోయినట్టు హాజరు పుస్తకంలో నమోదైందని ఏసీపీ వివరించారు. శుక్రవారం రాత్రి అతని కాల్ డేటా పరిశీలిస్తే నలుగురు వ్యక్తులతో ఫోన్ ఎక్కువసేపు మాట్లాడినట్టు అర్థమవుతోందని, అడపా హరీశ్, అవేష్ రెడ్డి అనే వ్యక్తుల నుంచి సంవత్సరం కిందట ఉద్యోగాల పేరిట రూ.50 లక్షలు తీసుకున్న విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఉద్యోగాల విషయమై వారు గట్టిగా ప్రశ్నిస్తే అదిగో, ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నాడని ఏసీపీ తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాసరావు కోసం గాలింపు జరుగుతోందని వెల్లడించారు.


More Telugu News