సీఐడీ విచారణపై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయనున్న ఏపీ సర్కారు!

  • అసైన్డ్ భూముల అంశంలో హైకోర్టు స్టే
  • నాలుగు వారాల పాటు సీఐడీ విచారణ నిలుపుదల
  • చంద్రబాబు, నారాయణకు వర్తించేలా స్టే ఉత్తర్వులు
  • సుప్రీంకోర్టులో స్టే వెకేట్ పిటిషన్ వేయనున్న ఏపీ సర్కారు
అసైన్డ్ భూముల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ విచారణ నిలిపివేయాలంటూ హైకోర్టు స్టే ఇవ్వడం తెలిసిందే. అయితే, ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లనుంది. నాలుగు వారాల పాటు సీఐడీ విచారణ నిలిపివేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించింది. స్టేను ఎత్తివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరనుంది.

కాగా, నిన్నటి స్టే కేవలం చంద్రబాబుకు, నారాయణకు మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేయడంతో... సీఐడీ అధికారులు ఈ కేసులో ఇతర అంశాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. భూముల వ్యవహారాలతో సంబంధం ఉన్న అధికారులు, రైతులను విచారించాలని భావిస్తున్నారు. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పలు ఆధారాలు సమర్పించారు. వాటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు సీఐడీ సన్నద్ధమవుతోంది.

ముఖ్యంగా, సాక్ష్యాధారాలను సంపాదించడంపైనే దర్యాప్తు బృందం దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజధాని చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసిన వారి వివరాలు సేకరిస్తుండడంతో పాటు ఐటీ, ఈడీ అధికారుల నుంచి కీలక సమాచారం కోసం లేఖ రాసింది.


More Telugu News