కొత్త పెళ్లికొడుకు బుమ్రాపై నెటిజన్ల ఫైర్

  • ఈ నెల 15న సంజనను పెళ్లాడిన బుమ్రా
  • పెళ్లి వేడుకలో టపాసులు కాలుస్తున్న ఫొటో షేర్ చేసిన వైనం
  • గతంలో టపాసులు కాల్చొద్దని అభిమానులను కోరిన బుమ్రా
టీమిండియా క్రికెటర్ జస్పీత్ బుమ్రా ఈనెల 15న ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ ఛానల్ వ్యాఖ్యాత సంజన గణేశన్ ను బుమ్రా పెళ్లాడాడు. గోవాలో అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి వేడుక జరిగింది. అయితే పెళ్లి జరిగేంత వరకు ఈ విషయాన్ని బుమ్రా గోప్యంగా ఉంచాడు. ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు.

 ఈ క్రమంలో పెళ్లి సమయంలో తీసుకున్న మరో రెండు ఫొటోలను బుమ్రా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన జీవితం కొన్ని రోజులుగా అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా బుమ్రా తెలిపాడు. తమకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

అయితే బుమ్రా షేర్ చేసిన ఒక ఫొటోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ వేడుకలో టపాసులు కాల్చినట్టు ఉంది. దీపావళి రోజున టపాసులు కాల్చొద్దని గతంలో ఒకసారి అభిమానులను కోరుతూ బుమ్రా ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో మొదట మీరు పాటించి ఆ తర్వాత ఇతరులకు చెప్పండని కొందరు... భాయ్, ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.


More Telugu News