రండి.. భారత్​ లో పెట్టుబడులు పెట్టండి: అమెరికా రక్షణ మంత్రితో రాజ్​ నాథ్​

  • రక్షణలో ఎఫ్ డీఐ నిబంధనలను సరళం చేశామని వెల్లడి
  • రక్షణ బంధం బలపడాలన్నదే బైడెన్ ప్రాధాన్యమన్న ఆస్టిన్
  • ప్రమాదంలో మరణించిన కెప్టెన్ ఆశిష్ గుప్తాకు నివాళి
  • రక్షణ రంగంలో పరస్పర సహకారం విస్తరిస్తామని సంయుక్త ప్రకటన
రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత విస్తరిస్తామని భారత్, అమెరికా సంయుక్త ప్రకటన చేశాయి. శుక్రవారం అమెరికా రక్షణ మంత్రి జనరల్ లాయిడ్ ఆస్టిన్.. భారత పర్యటనకు వచ్చారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. రక్షణ రంగంలో సహకారం, వర్తమాన అంశాలపై సమాచార మార్పిడి, రక్షణ పరికరాల రవాణాలో పరస్పర తోడ్పాటు వంటి విషయాలపై చర్చించినట్టు ప్రకటించారు.

రెండు దేశాల సంయుక్త సైనిక కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా చర్చలు జరిగాయని రాజ్ నాథ్ చెప్పారు. లాయిడ్ ఆస్టిన్, ఆయన అధికార బృందంతో చర్చలు ఫలవంతంగా సాగాయన్నారు. సమగ్రమైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠపరిచేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

‘‘రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డీఐ) కోసం నిబంధనలను మరింత సరళతరం చేశాం. దానిని అమెరికా రక్షణ పరిశ్రమలు వాడుకోవాలి. మా దేశంలో పెట్టుబడులు పెట్టండి’’ అని రాజ్ నాథ్ చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతను పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్, సెంట్రల్ కమాండ్, ఆఫ్రికా కమాండ్ తో కలిసి పనిచేస్తామన్నారు.

కాగా, గత వారం మిగ్ 21 బైసన్ యుద్ధ విమాన ప్రమాదంలో చనిపోయిన భారత వైమానిక దళ కెప్టెన్ ఆశిష్ గుప్తాకు ఆస్టిన్ నివాళులర్పించారు. దేశ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణకు సైన్యం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నదో ఆశిష్ మరణం గుర్తు చేస్తూనే ఉంటుందని అన్నారు. మిత్ర దేశాలు, భాగస్వాముల పట్ల బైడెన్ ప్రభుత్వ వైఖరి ఏంటో రాజ్ నాథ్ కు వివరించానన్నారు.

‘‘భారత్–అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలపడాలన్నదే బైడెన్ ప్రభుత్వ ప్రాధాన్యం. దానిపైనే రాజ్ నాథ్ తో చర్చించాం. రక్షణ వాణిజ్యం, ప్రాంతీయ భద్రతలో సహకారం, సైనిక కార్యకలాపాలపై మాట్లాడుకున్నాం’’ అని ఆయన తెలిపారు.


More Telugu News