బిగ్​ బీకి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు.. అందజేసిన హాలీవుడ్​ దర్శకులు మార్టిన్​ స్కోర్సీస్​, క్రిస్టోఫర్​ నోలన్​

  • ఎఫ్ఐఏఎఫ్ అవార్డును అందుకున్న అమితాబ్
  • వర్చువల్ గా కార్యక్రమం నిర్వహణ
  • ముంబైలో అవార్డు తీసుకున్న మెగాస్టార్
  • పొగడ్తలు కురిపించిన స్కోర్సీస్, నోలన్
బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్ఐఏఎఫ్) అవార్డును పొందారు. వర్చువల్ గా జరిగిన కార్యక్రమంలో బిగ్ బీకి హాలీవుడ్ ప్రముఖ దర్శకులు మార్టిన్ స్కోర్సీస్, క్రిస్టోఫర్ నోలన్ లు అవార్డును అందించారు.

భారత సినిమా వారసత్వాన్ని నిలబెడుతున్నందుకు గానూ అమితాబ్ ను ఈ అవార్డు వరించింది. ప్రముఖ సినిమా ఆర్కైవిస్ట్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివేంద్ర సింగ్ దుంగార్పూర్.. బిగ్ బీని నామినేట్ చేశారు.

ఎఫ్ఐఏఎఫ్ సెక్రటరీ జనరల్ మైఖేల్ లోబెన్ స్టీన్, ప్రెసిడెంట్ ఫ్రెడరిక్ మైర్ ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. కార్యక్రమంలో భాగంగా మార్టిన్ స్కోర్సీస్, నోలన్ లు అమితాబ్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఈ ఏడాది అవార్డుకు బిగ్ బీని మించిన అర్హులు లేరని స్కోర్సీస్ అన్నారు.

భారత సినీ చరిత్రను కాపాడడంతో ఆయన పాత్ర ఎంతో గొప్పదన్నారు. దాని కోసం ఆయన ఎంతగా పరితపించారో తనకు బాగా తెలుసన్నారు. ఓ లెజెండ్ ను కొన్నేళ్ల క్రితం కలిశానని, అందుకు తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ముంబైలో అమితాబ్ ను కలిసిన నాటి జ్ఞాపకాలను నోలన్ గుర్తు చేసుకున్నారు. సినిమాను కాపాడేందుకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు.

అసలైన అవార్డును ముంబైలో బిగ్ బీకి శివేంద్ర సింగ్ దుంగార్పూర్ అందజేశారు. అవార్డు రావడం సంతోషంగా ఉందని అమితాబ్ చెప్పారు. 2015 నుంచి ఫౌండేషన్ కోసం పనిచేస్తున్నానన్నారు. అవార్డు తీసుకుంటున్న ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘ఎఫ్ఐఏఎఫ్ అవార్డు రావడం  సంతోషంగా ఉంది. అవార్డును బహూకరించిన ఎఫ్ఐఏఎఫ్, మార్టిన్ స్కోర్సీస్, నోలన్ లకు ధన్యవాదాలు. ప్రపంచం మొత్తాన్ని వర్చువల్ గా కలుపుతున్న ఆధునిక సాంకేతికతను మెచ్చుకోవాల్సిందే’’ అని ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News