కొవాగ్జిన్‌ టీకాలో మార్పులు అవసరం లేదు.. స్పష్టం చేసిన కేంద్రం

  • కొత్త రకాల వైరస్‌లనూ సమర్థంగా ఎదుర్కొంటోంది
  • దేశంలో ఇప్పటి వరకు నాలుగు కొత్త రకాల వైరస్‌ల గుర్తింపు
  • బ్రిటన్‌ రకంపై ఆస్ట్రాజెనెకా టీకా 74.6 శాతం సమర్థత
  • దక్షిణాఫ్రికా రకంపై ఆస్ట్రాజెనెకా పదిశాతం మాత్రమే ప్రభావం
దేశీయంగా తయారు చేసిన కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన  అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు గుర్తించిన కొత్తరకం వైరస్‌లపైనా ఈ టీకా సమర్థంగా పనిచేస్తోందని..  ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తున్నట్లు కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. కొత్తరకం వైరస్‌లు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టీకాల్లో ఏమైనా మార్పులు చేయాలా? అని సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది.

దేశంలో ఇప్పటివరకు నాలుగు కొత్తరకం కరోనా వైరస్‌లను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. వీటిలో బ్రిటన్‌కు చెందినవి రెండు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ రకాలు ఒకటి చొప్పున గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విని చౌబే తెలిపారు.

భారత్‌లో వెలుగుచూసిన బ్రిటన్‌, బ్రెజిల్‌ స్ట్రెయిన్‌లపై కొవాగ్జిన్‌ సమర్థంగానే పనిచేస్తున్నట్లు తేలిందని.. దక్షిణాఫ్రికా రకంపై ఈ టీకా సమర్థతపై ప్రస్తుతం విశ్లేషణ జరుగుతోందని చెప్పారు. ఇక బ్రిటన్‌ రకంపై ఆస్ట్రాజెనెకా టీకా 74.6 శాతం సమర్థత కనబరిచిందని, బ్రెజిల్‌ రకంపైనా టీకా సమర్థంగా పనిచేసినట్లు సమాచారం ఉందన్నారు. కానీ, దక్షిణాఫ్రికా రకంపై ఆస్ట్రాజెనెకా టీకా కేవలం పదిశాతం మాత్రమే సమర్థత చూపించిందని, దీంతో టీకా మార్పులపై ఆ సంస్థ దృష్టి సారించిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

మరోవైపు దేశంలో ఇప్పటివరకు 3.93 కోట్ల కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 20 లక్షల కరోనా టీకా డోసులను అందిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం పేర్కొంది.


More Telugu News