అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు... హఠాత్తుగా ఎన్‌ఐఏకు ఎందుకు అప్పగించారని శివసేన ప్రశ్న

  • రోజుకో మలుపు తిరుగుతున్న దర్యాప్తు
  • పోలీసు అధికారి సచిన్‌ వాజే అరెస్టు
  • ముంబయి పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్‌పై వేటు
  • తీవ్రంగా మండిపడ్డ శివసేన
  • గతంలో దొరికిన జిలెటిన్ స్టిక్స్‌ కేసులు ఏమయ్యాయని ప్రశ్న
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపి ఉంచిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసు అధికారి సచిన్ వాజేను ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. మరోవైపు ముంబయి పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్‌పై వేటు పడింది. ఈ పరిణామాలపై శివసేన పార్టీ అధికారిక పత్రిక సామ్నా ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. భాజపా వైఖరిని, ఎన్‌ఐఏ దర్యాప్తు తీరును ప్రశ్నించింది.

‘కార్మిచేల్ రోడ్డులో దొరికిన 20 జిలిటెన్‌ స్టిక్స్ పేలలేదు. కానీ ఈ పేలుడు పదార్థాలు రాజకీయ, అధికార యంత్రాంగంలో మాత్రం భారీ పేలుళ్లకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముంబయి పోలీసు కమిషనర్‌ తన పదవి నుంచి బదిలీ కావాల్సి వచ్చింది’ అంటూ శివసేన తమ పత్రికలో విమర్శనాత్మక కథనం రాసింది. ఈ కేసును ముంబయి పోలీసు శాఖకు చెందిన ఉగ్రవాద నిరోధక బృందం దర్యాప్తు చేస్తోంది. హఠాత్తుగా ఈ కేసు ఎన్ఐఏకు  ఎందుకు బదిలీ అయ్యిందంటూ అనుమానం వ్యక్తం చేసింది.

‘ఈ ఘటనల వెనుక ఉన్న అసలు ఉద్దేశం త్వరలోనే బయటకు వస్తుంది. ఈ కేసుకు ఉగ్రవాదంతో సంబంధం లేకున్నా.. ఎన్‌ఐఏ ఎందుకు ప్రత్యేక దృష్టి సారించింది. అసలు ఏం జరుగుతోంది? దేశవ్యాప్తంగా ఉగ్రవాద ఘటనలపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఐఏ ఉరి, పఠాన్‌కోట్‌, పుల్వామా దాడుల సమయంలో గుర్తించిన జిలిటెన్‌ స్టిక్స్‌పై ఎలాంటి నిజాలు బయటపెట్టింది? ఎంతమంది నేరస్థులను అరెస్టు చేశారు? వంటి విషయాలు ఇప్పటికీ రహస్యమే’’ అంటూ శివసేన తీవ్ర ఆరోపణలు చేసింది.

పరంబీర్‌.. కంగన, సుశాంత్‌ సింగ్‌కు సంబంధించిన పలు కీలక కేసుల్ని దర్యాప్తు చేశారని శివసేన గుర్తుచేసింది. కీలక సమయంలో ఆయన ముంబయి పోలీసు విభాగానికి నేతృత్వం వహించారని తెలిపింది. ఎక్కడా పోలీసు శాఖ నైతికత దెబ్బతినేలా చేయలేదని రాసుకొచ్చింది. టీఆర్‌పీ స్కాం కేసు సైతం ఆయన హయాంలోనే వెలుగులోకి వచ్చిందని తెలిపింది. అందుకే ఢిల్లీలోని ఓ బలమైన వర్గం ఆయనపై ఆగ్రహంతో ఉందని ఆరోపించింది.

అయితే ఈ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. వాజే బృందానికి శివసేన అండగా నిలుస్తోందని ఆరోపించింది. మరోవైపు వాజే క్షమించరాని తప్పులు చేశారని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన హోంమంత్రి తెలిపారని గుర్తుచేసింది. ఒకే ప్రభుత్వంలో ఉన్న ఇరు పక్షాలు ఇలా విరుద్ధ ప్రకటనలు చేయడం ఏంటని ప్రశ్నించింది. ప్రభుత్వంలో ఉన్న విభేదాల వల్ల రాష్ట్ర శాంతి, భద్రతలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.


More Telugu News