జపాన్‌కు భారత ఒలింపిక్ బృందం ముందే చేరుకునే దిశగా చర్యలు.. కిరణ్‌ రిజిజు

  • ఒలింపిక్‌కు మరో మూడు నెలల సమయం
  • క్రీడాకారులు అక్కడి వాతావరణానికి అలవాటుపడే అవకాశం
  • అక్కడి పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ
  • పునియా టీకా తీసుకోవడంపై స్పందించిన రిజిజు
  • సురక్షితంగా ఉండడం కోసమే తీసుకొని ఉంటారని వ్యాఖ్య
మరికొన్ని రోజుల్లో జరగనున్న ఒలింపిక్‌ క్రీడలకు భారత బృందాన్ని ముందుగానే పంపేందుకు యోచిస్తున్నామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. మరో మూడు నెలల సమయమే ఉన్నందున క్రీడాకారులు ఒలింపిక్స్‌ బరిలో నిలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని.. తద్వారా దేశ ప్రతిష్ఠకోసం కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈ క్రమంలో వారిని ముందుగానే జపాన్ పంపాలనే చర్చలు జరుగుతున్నాయన్నారు. దీంతో వారు అక్కడి వాతావరణానికి అలవాటుపడతారని తెలిపారు. అలాగే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వారికి శిక్షణ కూడా లభిస్తుందన్నారు. ఈ మేరకు ఇప్పటికే దీనిపై భారత ఒలింపిక్‌ సంఘంతో చర్చలు జరుపుతున్నామన్నారు.

మరోవైపు ప్రముఖ రెజ్లర్‌ భజరంగ్‌ పునియా ఇప్పటికే కొవిడ్‌ టీకా తీసుకున్నానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు భారత్‌లో 60 ఏళ్లు పైబడినవారు లేదా 45 ఏళ్లు పైబడి వివిధ దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి మాత్రమే టీకా ఇస్తున్నారు. పునియా ఈ వర్గానికి చెందినవాడు కాకపోవడం సర్వత్రా చర్చ మొదలైంది.

దీనిపై స్పందించిన రిజిజు.. ఒలింపిక్‌ క్రీడాకారులకు టీకా అందించడంపై ఆరోగ్యశాఖతో చర్చలు జరుపుతున్నామన్నారు. అయితే, జాప్యం జరుగుతోందని భావించి పునియా ముందుగానే టీకా తీసుకున్నట్లున్నారని వ్యాఖ్యానించారు. తనను తాను సురక్షితంగా ఉంచుకోవాలని భావించే ఆయన టీకా తీసుకొని ఉండి ఉంటారని తెలిపారు.


More Telugu News