జగన్ ఈ రాష్ట్రానికి సీఎం... ఆయనను కలవడంలో తప్పులేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

  • తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
  • చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి
  • జగన్ పై జేసీ పొగడ్తలు
  • తండ్రిలాగానే జగన్ కు నైతిక విలువలున్నాయని వ్యాఖ్యలు
  • త్వరలోనే జగన్ ను కలుస్తానని వెల్లడి
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ వశమైన సంగతి తెలిసిందే. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఇక్కడ చివరి నిమిషంలో వైసీపీ హడావిడి పెద్దగా కనిపించలేదు.  తాడిపత్రిలో ఉద్దేశపూర్వకంగానే వైసీపీ మౌనం దాల్చిందని ఊహాగానాలు వినిపించాయి. చైర్మన్ ఎన్నిక అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు తగిన విధంగానే ఉన్నాయి.

జగన్ తన తండ్రి వైఎస్ లాగా నైతిక విలువలు ఉన్న వ్యక్తి అని కొనియాడారు. జగన్ తలుచుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో తాను చైర్మన్ ను అయ్యేవాడ్ని కాదని పేర్కొన్నారు. త్వరలోనే సీఎం జగన్, మంత్రి బొత్సలను కలుస్తానని, తాడిపత్రి అభివృద్ధి కోసం వారి సాయం కోరతానని జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, ఆయనను కలవడంలో తప్పులేదని అన్నారు. తాను ఏంచేసినా తాడిపత్రి అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ కూడా తనను ప్రశంసించారని జేసీ గుర్తుచేసుకున్నారు.


More Telugu News