యువతుల వస్త్రధారణపై సీఎం రావత్ వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించిన ఆయన భార్య

  • మోకాళ్లు కనిపించేలా చిరిగిన జీన్స్ ధరిస్తున్నారని రావత్ మండిపాటు
  • రావత్ వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు
  • తన భర్త వ్యాఖ్యలను పూర్తిగా చూపించలేదన్న రష్మి త్యాగి
యువతుల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోకాళ్లు కనిపించేలా చిరిగిన జీన్స్ ధరించడం సరికాదని ఆయన అన్నారు. ఇలాంటి వస్త్రధారణ వల్ల వారు లైంగిక వేధింపులకు కూడా గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

పాశ్యాత్య దేశాల ప్రజలు మన దేశ సంప్రదాయాలను పాటిస్తుంటే... మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామని మండిపడ్డారు. రావత్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలతో పాటు కొందరు సెలబ్రిటీలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. రావత్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. మరోవైపు రావత్ వ్యాఖ్యలను ఆయన భార్య రష్మి త్యాగి సమర్థించారు.

'ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని సరిగా చూపించలేదు. మన సమాజాన్ని, దేశాన్ని నిర్మించడంలో మహిళల పాత్ర అపూర్వమైనదని ఆయన అన్నారు. మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, మన ఉనికిని, మన వస్త్రధారణను కాపాడాల్సిన బాధ్యత భారతీయ మహిళలపై ఉందని ఆయన చెప్పారు' అని రష్మి వివరించారు. అనవసరంగా ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కూడా రావత్ ను సమర్థించారు. పురుషులైనా, స్త్రీలైనా గౌరవప్రదమైన విధంగా వస్త్రాలను ధరించాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు, కుమార్తెల వల్లే కుటుంబానికి గౌరవం వస్తుందని... కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందని చెప్పారు.


More Telugu News