'నల్గొండ'లో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి.. ఎవ‌రినీ వ‌రించ‌ని విజ‌యం

  • ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • అభ్య‌ర్థి విజ‌యానికి రావాల్సిన ఓట్లు 1,83,167
  • తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఎవ‌రికీ రాని వైనం
నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవ‌డం, విజ‌యానికి కావాల్సిన ఓట్లు ఎవ‌రికీ ద‌క్క‌క‌పోవ‌డంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. కాగా, తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఏడు రౌండ్ల తర్వాత టీఆర్ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజ‌లో ఉన్నారు. ఆయ‌న కంటే స్వ‌తంత్ర‌ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 27,550 ఓట్లతో వెన‌క‌బ‌డి ఉన్నారు.

తొలి ప్రాధాన్యత ఓట్లలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,10,840 ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 83,290 ఓట్లు వ‌చ్చాయి. తెలంగాణ జ‌న‌స‌మితి అధ్య‌క్షుడు కోదండరాంకు 70,072 ఓట్లు, బీజేపీ అభ్య‌ర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39,107 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి రాములు నాయక్ కు 27,588 ఓట్లు వచ్చాయి.

21, 636 ఓట్లు చెల్లు బాటు కాలేదని అధికారులు చెప్పారు. పోలైన ఓట్ల‌లో ఏ అభ్య‌ర్థికి స‌గానికి పైగా ఓట్లు వ‌స్తాయో వారు విజేత‌గా నిలుస్తారు. అయితే, తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఏ అభ్య‌ర్థికీ సగానికి పైగా ఓట్లు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

దీంతో  రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కింపు ప్రారంభ‌మైంది. దీంతో వీటి ఫ‌లితాలు రావ‌డానికి మ‌ళ్లీ సుదీర్ఘ స‌మయం ప‌ట్ట‌నుంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ లో అభ్య‌ర్థి విజ‌యానికి 1,83,167 ఓట్లు రావాల్సి ఉంటుంది.


More Telugu News