వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ, సాగు చట్టాలకు వ్యతిరేకంగా కేఏ పాల్ ఆమరణ దీక్ష

  • ఎల్లుండి నుంచి ఢిల్లీలో దీక్ష
  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్
  • వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటామన్న రాకేశ్ తికాయత్
ప్రముఖ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 21 నుంచి ఢిల్లీలో నిరవధికంగా ఆమరణదీక్షకు కూర్చోనున్నట్టు తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను నిన్న కలిసిన పాల్ వారికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఏపీ భవన్‌లో రైతు నేత రాకేశ్ తికాయత్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
 
 వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశామన్న పాల్.. సాగు చట్టాలను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మకానికి పెట్టేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రైతులను కూడా అమ్మేస్తోందని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఉక్కు కార్మికులకు తాము అండగా ఉంటామన్నారు. అలాగే, సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.


More Telugu News