సద్దాం హుస్సేన్‌, గడాఫీలను ఉటంకిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ

  • బీజేపీ విజయాల్ని సద్దాం హుస్సేన్‌, గడాఫీ గెలుపుతో పోల్చిన రాహుల్‌
  • కాంగ్రెస్‌ నేతపై తీవ్రంగా మండిపడ్డ బీజేపీ 
  • భారత్‌ ఓటర్లని రాహుల్ అవమానించారని వ్యాఖ్య
  • ఇంతటి అవమానం ఎప్పుడూ జరగలేదన్న జవదేకర్‌
బీజేపీ విజయాల్ని నియంత పాలకులు దివంగత సద్దాం హుస్సేన్‌, మహ్మద్‌ గడాఫీల గెలుపుతో పోలుస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ మాట్లాడుతూ.. రాహుల్‌ వ్యాఖ్యలు దేశంలోని 80 కోట్ల మంది ఓటర్లను కించపరిచేలా ఉన్నాయన్నారు. ఇంతటి అవమానం భారత ప్రజలు దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో తప్ప మరెప్పుడూ ఎదుర్కొలేదని వ్యాఖ్యానించారు.

అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ అశుతోష్‌ వర్షినీతో ఆన్‌లైన్‌లో చర్చ నిర్వహించిన రాహుల్‌ గాంధీ.. పరోక్షంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సద్దాం హుస్సేన్‌, గడాఫీ గెలుపులతో ఆయన పోల్చారు.

‘‘సద్దాం హుస్సేన్, గడాఫీ కూడా ఎన్నికల్లో గెలుపొందినవారే. అక్కడ ప్రజలు ఓటు వేయలేదని కాదు. కానీ, వారి ఓటు హక్కును కాపాడే పటిష్ఠమైన వ్యవస్థ అక్కడ లేదు. ఎన్నికలంటే ప్రజలు ఓటింగ్ యంత్రంపై ఉండే మీటను నొక్కడం కాదు. ఎన్నికలంటే ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. దేశంలోని వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించడం. న్యాయ వ్యవస్థ పారదర్శకంగా వ్యవహరిస్తోందని అంగీకరించడం. పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరుగుతోందని తెలపడం. ఎన్నికల ఫలితాల సమయంలో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

ఇటీవల స్వీడన్‌కి చెందిన వీ-డెమ్  అనే సంస్థ ‘భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నుంచి ఎన్నికల నిరశంకుశత్వం వైపు మళ్లుతోంది’ అని తమ ఓ నివేదికలో వెల్లడించింది. వీటి ఆధారంగానే రాహుల్‌ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు.


More Telugu News