టీఎంసీ మేనిఫెస్టో విడుదల.. ప్రజాకర్షక పథకాలను ప్రకటించిన మమతా బెనర్జీ

  • పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు
  • మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 విడతల్లో పోలింగ్
  • అధికార తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీ
  • తమది ప్రజల మేనిఫెస్టో అని మమతా వెల్లడి
పశ్చిమ బెంగాల్ లో మళ్లీ అధికారం చేపట్టాలని, బీజేపీని తుక్కు కింద ఓడించాలని కంకణం కట్టుకున్న సీఎం మమతా బెనర్జీ కొద్దిసేపటి కిందట తృణమూల్ కాంగ్రెస్ పార్టీ  మేనిఫెస్టో విడుదల చేశారు. కుటుంబాన్ని మోస్తున్న ప్రతి మహిళకు నెలకు రూ.500 ఇస్తామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు రూ.1000 ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

కుటుంబంలోని మహిళా సంరక్షకురాలికి ఈ పథకం వర్తిస్తుందని, ఇందులో ఎలాంటి వివక్షకు తావులేదని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ పథకం ప్రజలందరికీ అని స్పష్టం చేశారు. ఈ పథకానికి తాము పేరు పెట్టలేదని, అయితే దీన్ని స్టయిఫండ్ అని పిలవలేమని, ఎందుకంటే కుటుంబంలోని తల్లులకు ఇచ్చేది కాబట్టి దీనికి త్వరలోనే పేరు పెడతామని వెల్లడించారు.

అంతేగాకుండా, ఏటా 5 లక్షల ఉద్యోగాల కల్పనకు పాటుపడతామని వెల్లడించారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు 4 శాతం వడ్డీతో 10 లక్షల విలువైన క్రెడిట్ కార్డు అందజేస్తామని వివరించారు. తమ పిల్లల ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు హైరానా పడాల్సిన అవసరంలేదని, ప్రభుత్వమే హామీదారుగా ఉంటుందని మమత చెప్పారు.

"ఇది రాజకీయ మేనిఫెస్టో కాదు. నా మేనిఫెస్టో అభివృద్ధి ఆధారితమైనది. ఎక్కడైతే ఎదగాలన్న బలమైన కాంక్ష ఉంటుందో అక్కడే ఓ మార్గం కూడా ఉంటుందని నేను నమ్ముతాను. ఇది ప్రజల మేనిఫెస్టో, ప్రజల కోసం, ప్రజల చేత రూపొందించిన మేనిఫెస్టో. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రజలు శాశ్వతం. మరెక్కడా లేని పథకాలు బెంగాల్లోనే ఉన్నాయి. 731 ప్రసూతి సెలవులు ఇస్తున్నాం. ఎందుకంటే మహిళా సాధికారతను మేం బలంగా నమ్ముతున్నాం" అని వివరించారు. పశ్చిమ బెంగాల్ లో ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.


More Telugu News