చైనా వెళ్లాలనుకుంటున్నారా... అయితే ఈ నిబంధన పాటించాల్సిందే!

  • చైనా వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి చేసిన ప్రభుత్వం
  • ఆ మేరకు సర్టిఫికెట్ ఉంటేనే చైనాలో ప్రవేశం
  • భారత్ సహా 20 దేశాలకు వర్తించేలా నిబంధన
  • చైనా అధికారిక మీడియా సంస్థ వెల్లడి
చైనా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇతర దేశాల నుంచి ఎవరైనా చైనా రావాలనుకుంటే తప్పనిసరిగా తాము తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. భారత్ సహా 20 దేశాల ప్రయాణికులకు ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది.

ఈ మేరకు ఢిల్లీలోని తమ దౌత్య కార్యాలయం వద్ద ఓ నోటీసును ప్రదర్శించింది. దీనిపై చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ వివరణ ఇచ్చింది. చైనా ప్రభుత్వం తాజా నిబంధనలో పేర్కొన్న 20 దేశాల్లోనూ ఈ తరహా నోటీసులు ప్రదర్శిస్తున్నట్టు వెల్లడించింది.

కరోనా వ్యాప్తి మొదలయ్యాక చైనా నుంచి 23 వేల మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారు. వారు తిరిగి చైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా, కొత్త నిబంధన వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. చైనా వ్యాక్సిన్ తీసుకున్నట్టుగా నిర్దేశిత సర్టిఫికెట్ ఉంటేనే తమ దేశంలోకి అడుగుపెట్టనిస్తామని గ్లోబల్ టైమ్స్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.


More Telugu News