పిల్లలకు కూడా కరోనా టీకా.. ప్రయోగాలు ప్రారంభించనున్న మోడెర్నా

  • అమెరికా, కెనడాలో ప్రయోగాలకు త్వరలో శ్రీకారం
  • 6 నెలల నుంచి 12 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు టీకా ఇచ్చే యోచన
  • అమెరికాలో పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలోనే ప్రయోగాలు
  • 6750 మంది పిల్లలను ఎంపిక చేసుకోవాలని ప్రణాళిక
పిల్లలకు కూడా కరోనా టీకా ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అమెరికాలో 6 నెలల నుంచి 12 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రయోగాలకు త్వరలో శ్రీకారం చుట్టనున్నామని మోడెర్నా కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఇందుకోసం 6750 మంది పిల్లలను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నామని సంస్థ పేర్కొంది.

అమెరికా, కెనడాలో రెండు, మూడో దశ ప్రయోగాలు ప్రారంభిస్తామని సంస్థ సీఈఓ స్టిఫానీ బన్సెల్‌ వెల్లడించారు. పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో కొవిడ్-19 లక్షణాలు స్వల్పంగా ఉంటాయని, అయితే  వైరస్ వ్యాప్తికి వీరు కూడా  కారకులవుతారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కొంతమంది పిల్లల్లో అసలు లక్షణాలే కనపడవని తెలిసింది.

ఈ నేపథ్యంలో వీరికి కూడా టీకా ఇవ్వాల్సి ఉంటుందని.. వీరిలో టీకా సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సంస్థ తెలిపింది. అమెరికాలో సాధ్యమైనంత త్వరగా పాఠశాలల్ని ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో మోడెర్నా ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లలకు తమ వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఈ సంస్థ ఇంకా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ప్రయోగాలు ఎప్పుడు ప్రారంభించేదీ త్వరలో తెలియజేస్తామని మోడెర్నా వెల్లడించింది. మరోవైపు పిల్లలపై టీకా ప్రయోగాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించాల్సి ఉంది.


More Telugu News