ఆదుకున్న దర్శకుడి రుణం తీర్చుకున్న హీరో విజయ్ సేతుపతి!

  • మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్న తమిళ స్టార్‌
  • కెరీర్ ఇచ్చిన దర్శకుడి ఆస్పత్రి బిల్లు కట్టిన సేతుపతి
  • జననాథన్ అంతిమ సంస్కారాల్లో కుటుంబానికి అండగా ఉన్న విజయ్‌
  •  స్టార్ హీరో సింప్లిసిటీకి ముగ్దులైన అభిమానులు
చిత్రపరిశ్రమలోని వ్యక్తుల్లో కృతజ్ఞత భావం అనేది తక్కువని చాలా మంది అంటుంటారు. అది పూర్తిగా అవాస్తవమని నిరూపించాడు తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్నేళ్ల పాటు తిండితిప్పలు లేక అల్లాడిపోయాడు విజయ్. అలాంటి కష్ట సమయంలో ఆయన్ని దర్శకుడు ఎస్పీ జననాథన్ ఆదుకున్నారు.

అయితే, మార్చ్ 14న జగనాథన్‌ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారు. ఆయన హఠాన్మరణం యావత్‌ తమిళ చిత్ర పరిశ్రమని విషాదంలోకి నెట్టింది. సామాజిక స్పృహతో కూడిన పలు సినిమాలు రూపొందించిన ఆయన 2003లోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు.

ఇక జననాథన్ తన చివరి సినిమా విజయ్ సేతుపతితోనే చేశారు. ‘లాభం’ పేరిట వచ్చిన ఆ సినిమా వ్యవసాయ నేపథ్యంతో  తెరకెక్కించారు. శ్రుతిహాసన్ ఇందులో కథానాయిక. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే అనారోగ్యం పాలైన జననాథన్‌ హఠాత్తుగా మరణించారు.

ఇదిలా ఉంటే, తనను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దర్శకుడి మరణం విజయ్‌ సేతుపతిని బాగా కలచివేసింది. జననాథన్‌ చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకున్న విజయ్ ఇప్పుడు హాస్పిటల్ ఛార్జీలు మొత్తం కట్టి రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు.

జననాథన్‌ కుటుంబ సభ్యులను విజయ్‌ ఒక్క రూపాయి కూడా కట్టనివ్వలేదు. అంతేకాదు.. జననాథన్ అనారోగ్యం వార్త తెలియగానే అందరికంటే ముందు స్పందించాడు. హాస్పిటల్‌కి వెళ్లి పలకరించాడు. చనిపోయాడని తెలిసిన తర్వాత ఆయన అంతిమ సంస్కారాలు పూర్తయ్యేవరకు జననాథన్ కుటుంబంతో పాటే ఉన్నాడు. తాను ఒక స్టార్ హీరో అనే సంగతి మర్చిపోయి సామాన్యుడిలా అక్కడ అందరితో కలిసిపోయాడు. తనకు మంచి కెరీర్ ఇచ్చిన దర్శకుడి కోసం కన్నీళ్లు కార్చాడు. ఇదంతా చూసిన అభిమానులు ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఆశ్చర్యపోయారు.


More Telugu News