రాయబార కార్యాలయం తప్పిదం కారణంగా.. హిందూ వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేసిన సౌదీ!

  • సౌదీలో మరణించిన భర్త
  • మృతదేహం కోసం నెలన్నరగా పడిగాపులు 
  • చేసేది లేక కోర్టును ఆశ్రయించిన భార్య
  • దీన్ని ఓ విచారకర ఘటనగా అభివర్ణించిన న్యాయమూర్తి
ఢిల్లీ హైకోర్టు ముందుకు మంగళవారం ఓ వింత కేసు విచారణకు వచ్చింది. సౌదీలోని జెడ్డాలో ఉన్న భారత రాయబార కార్యాలయంలోని అధికారులు అనువాదంలో చేసిన తప్పు వల్ల ఓ హిందూ వ్యక్తి దహన సంస్కారాలు ముస్లిం మత సంప్రదాయంలో నిర్వహించారు. సౌదీలోనే ఆయన మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

దీంతో తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్న ఆ వ్యక్తి భార్య ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. అయినా, సరైన స్పందన లభించకపోవడంతో చేసేది లేక హైకోర్టును ఆశ్రయించారు. ఎలాగైనా తన భర్త మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు ఏర్పాట్లు చేసేలా విదేశాంగ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని వేడుకున్నారు.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్‌ ప్రభుత్వ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దీన్ని ఓ విచారకరమైన సంఘటనగా పేర్కొన్న ఆమె.. సౌదీ నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. మార్చి 18న జరగబోయే విచారణకు విదేశాంగ శాఖలోని ఓ ఉన్నతాధికారి హాజరు కావాలని ఆదేశించారు. ఈ విషయంలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటో కోర్టు తెలియజేయాలన్నారు.

సంజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. జనవరి 24న గుండెపోటు రావడంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు సహాయం చేయాలని విదేశాంగ శాఖ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అనుకోకుండా ఫిబ్రవరి 18న ఓ చేదు వార్త వారి దృష్టికి వచ్చింది. ఆయన మృతదేహాన్ని అక్కడే పూడ్చేశారని తెలిసింది. భారత రాయబార కార్యాలయంలోని అధికారి..  చనిపోయిన వ్యక్తి మతాన్ని ముస్లిం అని తప్పుగా పేర్కొనడం వల్లే అలా జరిగిందని ఇక్కడి అధికారులు వివరించారు. దీంతో చేసేది లేక ఆయన భార్య కోర్టును ఆశ్రయించారు.


More Telugu News