ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమైనదే: బ్రిటన్ ప్రధాని

  • ఈ టీకా వల్ల రక్తం గడ్డకడుతోందంటూ వార్తలు  
  • వ్యాక్సినేషన్‌ నిలిపివేసేది లేదని బోరిస్ స్పష్టీకరణ
  • భారత్‌, యూకే, అమెరికాలో టీకా తయారవుతోందన్న  బ్రిటన్ ప్రధాని
ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ సురక్షితమైనదని బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్పష్టం చేశారు. ఈ టీకా వల్ల ఎలాంటి హాని జరగదని భరోసానిచ్చారు. కొన్ని ఐరోపా దేశాల్లో ఈ టీకా వల్ల రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న వార్తల్ని ఆయన తోసిపుచ్చారు.

భారత్‌, అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో టీకాను ఉత్పత్తి చేస్తున్నారని.. దీన్ని ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బ్రిటన్‌ ఔషధ నియంత్రణ సంస్థ ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన, అనుభవం కలిగిన వ్యవస్థ అని తెలిపారు. టీకా సురక్షితమైనదేనని వారు కూడా ధ్రువీకరించారన్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిలిపివేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకడుతున్నట్లు వార్తలు రావడంతో రిపబ్లిక్ ఆఫ్‌ ఐర్లాండ్‌, బల్గేరియా, డెన్మార్క్‌, నార్వే, ఐస్‌లాండ్‌ వంటి దేశాలు ఇప్పటికే టీకా పంపిణీని నిలిపివేశాయి. తాజాగా వీటి సరసన నెదర్లాండ్స్‌, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ కూడా చేరాయి. ఇదిలా ఉండగా.. తమ టీకా వల్ల రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న వార్తల్ని ఆస్ట్రాజెనెకా ఖండించింది. టీకా వల్లే రక్తం గడ్డకట్టినట్లు ఆధారాలేమీ లేవని తెలిపింది.


More Telugu News