ఎస్ఈసీ ఆదేశాలను రద్దు చేసిన ఏపీ హైకోర్టు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణకు ఆదేశించిన ఎస్ఈసీ
  • ఎస్ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు
  • ఏకగ్రీవాలైన చోట్ల డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏపీ హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది. నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణలు, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న ఎస్ఈసీ ఆదేశాలను కోర్టు రద్దు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏకగ్రీవాలపై ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విచారణకు ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు.

ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈరోజు తుది తీర్పును వెలువరించింది. ఏకగ్రీవాలపై ఫామ్-10 ఇచ్చిన స్థానాల్లో విచారించే అధికారం ఎస్ఈసీకి లేదన్న పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఎస్ఈసీ ఆదేశాలను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. ఏకగ్రీవాలైన చోట్ల డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది.


More Telugu News