వివాదం నడుమ రాజ్యసభ సభ్యత్వానికి స్వపన్​ దాస్​ గుప్తా రాజీనామా

  • రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
  • నామినేటెడ్ ఎంపీలు పార్టీల్లో చేరడం రాజ్యంగ విరుద్ధమన్న తృణమూల్ ఎంపీ
  • రాజీనామా లేఖను చైర్మన్ కు పంపిన స్వపన్
  • తారకేశ్వర్ నుంచి త్వరలోనే నామినేషన్ వేస్తానని వెల్లడి
పశ్చిమబెంగాల్ ఎన్నికల బరిలో నిలిచిన స్వపన్ దాస్ గుప్తా తన రాజ్యసభ సీటుకు రాజీనామా చేశారు. రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు నామినేట్ అయిన వ్యక్తులెవరూ రాజకీయ పార్టీలో చేరరాదని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 2022 వరకు ఆయన పదవీ కాలం ఉండగా.. బెంగాల్ ఎన్నికల కోసం ముందే పదవి నుంచి తప్పుకొన్నారు.

ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ కు తన రాజీనామాను పంపారు. ట్విట్టర్ లోనూ తన రాజీనామా గురించి పోస్ట్ పెట్టారు. మెరుగైన బెంగాల్ కోసం పోరాడేందుకు తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని ట్వీట్ చేశారు. రాబోయే కొన్ని రోజుల్లో తారకేశ్వర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని చెప్పారు.

‘‘రాష్ట్రపతి నామినీగా రాజ్యసభలో నాకంటూ ఓ హోదా ఉంది. అయితే, బీజేపీ అభ్యర్థిగా బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. తారకేశ్వర్ నుంచి బరిలోకి దిగుతున్నాను. దీంతో చాలా సమస్యలు సహజంగానే వస్తున్నాయి. నామినేషన్ వేయడానికి అవి అడ్డుగా మారుతున్నాయి. నామినేషన్ వేసే నాటికి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటాను. నేనింకా నామినేషన్ సమర్పించలేదు. గురువారం లేదా శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తాను’’ అని ఆయన చెప్పారు.

తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా ట్వీట్ పై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. 2016లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. స్వపన్ దాస్ గుప్తాను రాజ్యసభకు నామినేట్ చేశారని, ఇప్పుడేమో బీజేపీ తరఫున బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం అది రాజ్యాంగ విరుద్ధమని ఆమె ట్వీట్ చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News