అదే నన్నిక్కడి వరకు తీసుకొచ్చింది: పురూలియా ప్రజలతో మమత

  • నందిగ్రామ్ ఘటన తర్వాత తొలిసారి ఎన్నికల ప్రచారం
  • నా గాయం నొప్పి కంటే ప్రజల బాధ పెద్దదన్న మమత
  • గాయంతో ఇంటికే పరిమితం అవుతానని భావించారంటూ విమర్శలు
తన కాలికి అయిన గాయం నొప్పి కంటే ప్రజల బాధే పెద్దదని, అదే తనను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని పురూలియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. నందిగ్రామ్ ఘటన తర్వాత టీఎంసీ అధినేత్రి తొలిసారి ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీల్‌చైర్‌లో కూర్చునే ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నందిగ్రామ్ లో జరిగిన ఘటన నుంచి ప్రాణాలతో అదృష్టవశాత్తు బయటపడ్డానని అన్నారు. గాయం తనను ఇంటికే పరిమితం చేస్తుందని, అందరూ భావించారని అయితే, తన కాలి నొప్పి కంటే ప్రజల బాధ పెద్దదని, అందుకే ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నానని అన్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అబద్ధాలతో గెలిచిందని సీఎం ఆరోపించారు. దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న గ్యాస్, ఇంధన ధరకు బీజేపీనే కారణమన్నారు. తాము గత పదేళ్లలో చేసిన అభివృద్ధి ప్రపంచంలో మరే ప్రభుత్వమూ చేయలేదన్నారు.


More Telugu News