జైలు తప్పదని మేం ఏ సోషల్ మీడియా సంస్థ ఉద్యోగులను బెదిరించలేదు: కేంద్రం

  • సోషల్ మీడియా సంస్థలపై కేంద్రం అసంతృప్తి
  • భారత చట్టాలకు లోబడే కార్యకలాపాలు సాగించాలని స్పష్టీకరణ
  • భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని ఉద్ఘాటన
  • ప్రకటన చేసిన ఐటీ మంత్రిత్వ శాఖ
ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తోంది. విద్వేషాలు వ్యాప్తి చేసే పోస్టులు, అభ్యంతరకర ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయంటూ కేంద్రం ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర సోషల్ నెట్వర్కింగ్ సంస్థలపై గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా సంస్థల ఉద్యోగులు జైలుకు వెళ్లక తప్పదని కేంద్రం బెదిరించినట్టుగా వస్తున్న కథనాలపై ఐటీ మంత్రిత్వ శాఖ స్పందించింది. తాము ఎవరినీ ఆ విధంగా బెదిరించలేదని స్పష్టం చేసింది.

అయితే, సోషల్ మీడియా వేదికలన్నీ భారతీయ చట్టాలకు లోబడే కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుందని, భారత రాజ్యాంగాన్ని గౌరవించడం తప్పనిసరి అని పేర్కొంది. ఇతర వ్యాపార రంగాలు ఏ విధంగా భారత వ్యవస్థల అదుపాజ్ఞల్లో ఉన్నాయో, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ వేదికలు కూడా అదే రీతిలో నడుచుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వివరించింది.


More Telugu News