తమిళనాడు అసెంబ్లీ పోల్స్: 215వసారి నామినేషన్ వేసిన పద్మరాజన్

  • ఎన్నికల రాజుగా గుర్తింపు పొందిన పద్మరాజన్
  • 1998 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ బరిలోకి
  • రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులపైనా పోటీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పద్మరాజన్ మరోమారు తెరపైకి వచ్చారు. రాష్ట్రంలో నిన్నటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా 62 ఏళ్ల పద్మరాజన్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇంతకీ ఎవరీ పద్మరాజు, ఏమా కథ? అని మీకు అనిపిస్తే ఇది చదవాల్సిందే.

పద్మరాజన్ ఓ సాధారణ వ్యక్తి మాత్రమే. అయినప్పటికీ ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారు. తాజాగా, నిన్న కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఇలా నామినేషన్ దాఖలు చేయడం ఇది వరుసగా 215వ సారి కావడం గమనార్హం.

‘తేర్దల్ మన్నన్’ (ఎన్నికల రాజు)గా పేరు పొందిన ఆయన మెట్టూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఏప్రిల్ 6న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.  8వ తరగతి మాత్రమే చదువుకున్న పద్మరాజన్ సహకార సంఘాల ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్నింటిలోనూ పోటీచేస్తారు. డిపాజిట్ చేసేందుకు డబ్బులు లేకుంటే భార్య శరీరంపై ఉన్న నగలను కుదవపెట్టి మరీ నామినేషన్ వేస్తుంటారు.

1998లో తొలిసారి మెట్టూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. ఆ తర్వాతి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రధాని సహా అగ్రనేతలు ఎక్కడ పోటీచేస్తే అక్కడ ఆయన కూడా పోటీ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పద్మరాజన్.


More Telugu News