అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు.. పోలీసు అధికారి అరెస్ట్

  • అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు
  • ముంబై అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు
  • 12 గంటల విచారణ తరువాత అరెస్ట్
బిలియనీర్ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ముంబై అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజే ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆయనను అదుపులోకి తీసుకుని 12 గంటలపాటు విచారించింది. ఆపై ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది.

గత నెల 25న ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన వాహనంలో పేలుడు పదార్థాలను గుర్తించారు. అందులో ముకేశ్ భార్య నీతా అంబానీని హెచ్చరిస్తూ ఉన్న లేఖను కూడా గుర్తించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పేలుడు పదార్థాలు ఉంచిన వాహన యజమాని మన్‌సుఖ్ హిరేన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆ వాహనం చోరీకి గురైనట్టు ఆయన అంతకుముందే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

అయినప్పటికీ ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఈ కేసు తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ప్రభుత్వం కేసును ఎన్ఐఏకు అప్పగించింది. హిరేన్ మృతి వెనక సచిన్ వాజే హస్తముందన్నఆరోపణలు వెల్లువెత్తడంతో ఉద్ధవ్ ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. తాజాగా, ఎన్ఐఏ ఆయనను అరెస్ట్ చేసింది.


More Telugu News