బురఖా వాడకంపై శ్రీలంకలో నిషేధం.. ఇస్లామిక్ పాఠశాలల మూసివేత!

  • శ్రీలంక మంత్రి వీరశేఖర మీడియా సమావేశం
  • బురఖా నిషేధం ఆదేశాలపై సంతకం చేశానని వెల్లడి
  • క్యాబినెట్ ఆమోదం వస్తే నిషేధం ప్రకటిస్తామన్న వీరశేఖర
  • గతంలో తాత్కాలిక నిషేధం
  • 2019లో శ్రీలంకలో ఉగ్రదాడులు
శ్రీలంక ప్రభుత్వం దేశంలో మహిళలు బురఖాలు ధరించడంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. వేయికి పైగా ఉన్న ఇస్లామిక్ పాఠశాలలను కూడా మూసివేయాలని తీర్మానించింది. ప్రజాభద్రత శాఖ మంత్రి శరత్ వీరశేఖర ఈ అంశంపై మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ నిషేధాజ్ఞలకు సంబంధించిన ఆదేశాలపై తాను సంతకం చేశానని, క్యాబినెట్ ఆమోదం కూడా వచ్చాక నిషేధాన్ని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. అప్పట్లో ముస్లిం మహిళలు, బాలికలు బురఖాలు ధరించేవారు కాదని, ఇస్లాం అతివాదం కారణంగానే బురఖాలు వచ్చాయని అన్నారు. తాము ఈ వైఖరిని తప్పకుండా నిషేధిస్తామని స్పష్టం చేశారు.

శ్రీలంకలో బురఖాలపై 2019లో తాత్కాలికంగా నిషేధం విధించారు. అందుకు కారణం నాటి బాంబు పేలుళ్లే. ఈస్టర్ పండుగ సందర్భగా చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తద్వారా ఉగ్రవాద పీడిత దేశాల్లో ఒకటిగా మారింది.

ఎల్టీటీఈ వేర్పాటు వాదులు సాగించిన అంతర్యుద్ధం ముగిశాక శ్రీలంకలో చాలామేరకు ప్రశాంత వాతావరణం నెలకొంది. 2019లో ఈస్టర్ పండుగ సందర్భంగా చోటుచేసుకున్న పేలుళ్లతో ఈ చిరు ద్వీపం ఉలిక్కిపడింది. అయినవారిని కోల్పోయిన వ్యక్తుల వేదన వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది


More Telugu News