వారం రోజుల్లో నలుగురి బలి... పులిపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్

  • కొడగు జిల్లాలో పులి రక్తదాహం
  • తోటల్లో పనిచేసే కార్మికులపై పంజా
  • 16 పశువులు, పెంపుడు జంతువులు కూడా బలి
  • రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్న ప్రజలు
  • పులి వేట ముమ్మరం చేసిన అధికారులు
మనిషి రక్తం రుచి మరిగిన పులి ఎంత ప్రమాదకరమో గతంలో అనేక నిదర్శనాలు ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని నాగర్ హోళ్ అటవీప్రాంతంలో ఓ పులి రక్తిపిపాసిలా మారింది. వారం రోజుల వ్యవధిలోనే తోటల్లో పనిచేసే నలుగురు కార్మికులను, 16 పశువులు, పెంపుడు జంతువులను చంపేసిన ఆ పులి ఓ సవాలుగా మారింది. దాంతో ప్రభుత్వం ఆ పులిపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేసింది. ఇటీవలే ఎనిమిదేళ్ల బాలుడ్ని చంపడంతో కొడగు జిల్లాలో ప్రజలు భీతావహులవుతున్నారు.

ఆ పులిని వెంటనే హతమార్చాలంటూ అధికారులను డిమాండ్ చేసిన ప్రజలు... అధికారులు చంపకపోతే తామే అడవిలోకి వెళ్లి ఆ పులిని అంతమొందిస్తామని స్పష్టం చేశారు. కొడగు రక్షణ వేదికతో పాటు పలు ఎన్జీవోలు పులి బారి నుంచి ప్రజలను కాపాడాలంటూ భారీ ప్రదర్శన నిర్వహించాయి. ఓవైపు పులి దాడులు, మరోవైపు ప్రజల నిరసనలతో అటవీశాఖ అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

దాంతో ఎలాగైనా పులిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం కూడా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పులి వేట ముమ్మరం చేశారు. కాగా, రక్తం రుచి మరిగిన ఆ పులి మగ పులి అని అధికారులు నిర్ధారించారు.


More Telugu News