హెచ్​1బీ వీసాలపై ట్రంప్​ ఆదేశాలతో నష్టం కలిగితే.. ఆ నష్టాన్ని పూడుస్తాం: బైడెన్​ ప్రభుత్వం

  • వీసా దరఖాస్తులను పున:సమీక్షిస్తామన్న యూఎస్సీఐఎస్
  • ఐ–129బీలో దరఖాస్తు చేసుకోవాలని సూచన
  • తాజా నిర్ణయంతో భారతీయులకు ఊరట
హెచ్1బీ వీసాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన మూడు వివాదాస్పద ఉత్తర్వులతో నష్టం జరిగిన వ్యక్తులకు న్యాయం చేస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా దానిపై అమెరికా పౌరసత్వ, వలస విధాన సేవల విభాగం (యూఎస్ సీఐఎస్) స్పందించింది.

ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో నష్టం జరిగిందని ఎవరైనా ఫార్మ్ ఐ–129బీ (అప్పీల్ నోటీస్ లేదా మోషన్)లో వివరాలు నింపి పిటిషన్ వేస్తే.. వారి దరఖాస్తును పున:సమీక్షించి, ఆ నష్టాన్ని పూడుస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో చాలా మంది భారతీయులకు ఊరట కలగనుంది.

అనివార్య పరిస్థితుల్లో అలాంటి అప్పీళ్లను పరిగణనలోకి తీసుకునే అధికారం తమకు ఉంటుందని వెల్లడించింది. అయితే, ట్రంప్ ఆదేశాలు ఇచ్చిన నాటికి సదరు వ్యక్తి హెచ్1బీ వీసా గడువు ముగిసిపోక ముందే దరఖాస్తు చేసి ఉండాలని లేదా ట్రంప్ ఆదేశాలకు నెల రోజుల తర్వాత వీసాకు దరఖాస్తు చేసి ఉండాలని సూచించింది. ట్రంప్ ప్రకటించిన ఆ మూడు విధానాల్లో ఏదో ఒక దాని వల్ల నష్టం కలిగినట్టు తేలితే.. తాము వారి దరఖాస్తులను పున:పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

గత ఏడాది జూన్ లో ట్రంప్ ప్రభుత్వం రెండు ఉత్తర్వులను రద్దు చేసింది. 2010 జనవరి 8న ఇచ్చిన ‘హెచ్1బీ వీసా కోసం ఉద్యోగి–సంస్థ మధ్య సంబంధం, థర్డ్ పార్టీ సైట్స్’, 2018 ఫిబ్రవరి 22న ఇచ్చిన ‘థర్డ్ పార్టీ వర్క్ సైట్స్ లో పని కోసం హెచ్1బీ వీసాకు అవసరమైన కాంట్రాక్టులు, దానికి సంబంధించిన నివేదిక’లను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. 2017 మార్చి 31న ఇచ్చిన ‘హెచ్1బీ వీసాలపై మార్గదర్శకాల ఉత్తర్వులు’ను ఈ ఏడాది ఫిబ్రవరి 3న రద్దు చేస్తూ ఇంకో ఉత్తర్వును జారీ చేసింది.

ఆ రెండు ఉత్తర్వుల ప్రకారం పెండింగ్ లో ఉన్న లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్న హెచ్1బీ వీసాలను జారీ చేసే లేదా తిరస్కరించే హక్కు పూర్తిగా తమకు ఉంటుందని పేర్కొంది. ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయాలతో చాలా మంది హెచ్1బీ వీసాలపై ప్రభావం పడింది. దీంతో ట్రంప్ ఇచ్చిన ఆ ఆదేశాలను బైడెన్ ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసింది. ఇప్పుడు వాటితో నష్టపోయిన వారికి మరో అవకాశం కల్పించేందుకు ముందుకు వచ్చింది.


More Telugu News