ప‌వ‌న్ క‌ల్యాణ్ పోరాడితే ఆ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది!: గంటా శ్రీ‌నివాస‌రావు

  • విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ను జీర్ణించుకోలేక‌పోతున్నాం
  • దాన్ని కొంద‌రు రాజ‌కీయం చేయ‌డం స‌రికాదు
  • జ‌గ‌న్ ముందుకువ‌స్తే చంద్ర‌బాబూ క‌లిసి పోరాడ‌తాన‌న్నారు
  • రాజీనామాలు చేసే సమయం ఆసన్నమైంద‌న్న గంటా   
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవ‌ల త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తిరుప‌తి ప్రెస్ క్ల‌బ్‌లో మాట్లాడుతూ...  విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీకరించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు. అందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు.

అయితే, త‌న‌ రాజీనామాను కొందరు రాజకీయం చేస్తున్నార‌ని, అటువంటి చ‌ర్య‌లు సరికాదని చెప్పారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు వ్య‌తిరేకంగా పార్టీలకు అతీతంగా అందరూ ఉద్యమించాల‌ని ఆయ‌న చెప్పారు. ఆ ప‌రిశ్ర‌మ‌ను కాపాడుకోవాల్సిన  అవసరం ఉందని తెలిపారు.

ఇందుకోసం సీఎం జగన్ ముందుకు రావాల‌ని, ఆయ‌న ఆ బాధ్యతను తీసుకుంటే తనూ కలిసి నడుస్తానని టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు కూడా స్పష్టం చేశారని గంటా శ్రీ‌నివాస‌రావు చెప్పారు. చివరి అస్త్రంగా రాజీనామాలు చేసే సమయం ఆసన్నమైంద‌ని తెలిపారు. విశాఖ‌ ఉక్కు ఉద్యమంలో జ‌న‌సేన అధినేత‌ పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయ‌న చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణ‌యాన్ని కేంద్ర  ప్ర‌భుత్వం  ఉపసంహరించుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు.


More Telugu News