గుంటూరు 42వ డివిజన్ టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం కేసు నమోదు

  • మునిసిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతల దాడి
  • మాజీ ఎంపీ మోదుగుల వాహనాలపై దాడి చేశారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు
  • ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మునిసిపల్ ఎన్నికల సందర్భంగా గుంటూరులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన దాడికి సంబంధించి టీడీపీ నేతలపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. గుంటూరు 42వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బుజ్జి సహా మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో 42వ డివిజన్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ, వైసీపీ నేతలను టీడీపీ నేతలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.

ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వాహనాలపై కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 42వ వార్డు టీడీపీ అభ్యర్థి అయిన బుజ్జి, ఆ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ తదితరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News