అబ్బాయి ఎత్తు 2 అడుగులు... తనకో వధువును చూడాలంటూ పోలీసులకు అభ్యర్థన

  • పెళ్లి కావడంలేదంటూ ఓ యువకుడి బెంగ
  • అబ్బాయి ఎత్తు తక్కువంటూ వెనుదిరుగుతున్న పెళ్లి సంబంధాలు
  • అఖిలేశ్ యాదవ్ ను కూడా కలిసిన యువకుడు
  • సీఎం ఆదిత్యనాథ్ కు లేఖ
  • అయినా కనిపించని ప్రయోజనం
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన అజీమ్ మన్సూరీ అనే యువకుడిది ఓ విచిత్ర గాథ. 26 ఏళ్ల అజీమ్ కు ఇప్పటివరకు పెళ్లి కాలేదు. అందుకు కారణం అబ్బాయి ఎత్తే. అజీమ్ కేవలం 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉండడంతో పెళ్లి సంబంధాలు రావడంలేదట. ఓ కాస్మెటిక్ దుకాణం నడుపుతూ ఫర్వాలేదనిపించేలా సంపాదిస్తున్న ఈ కుర్రవాడికి పెళ్లి కావడంలేదన్న బెంగ నానాటికీ అధికమవుతోంది. ఏవో కొన్ని సంబంధాలు వచ్చినా, వచ్చినవాళ్లు వచ్చినట్టే వెళ్లిపోతుండడంతో అజీమ్ కు వివాహం అనేది ఓ తీరని కలగా మిగిలిపోయింది.

దాంతో అతడు చివరి ప్రయత్నంగా పోలీసులను సాయం కోరాడు. ఇది కూడా ఓ రకమైన ప్రజాసేవ అనుకుని తనకో మంచి వధువును వెతకాలని స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ఆరుగురు సంతానంలో అజీమ్ చివరివాడు. అతడి తండ్రి ఓ సామాజిక కార్యకర్త. తన బిడ్డకు పెళ్లి కాకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. తాము చాలా ప్రయత్నాలు చేశామని, కానీ తన కుమారుడి ఎత్తు చూసి సంబంధాలేవీ కుదరడంలేదని వాపోయారు.

2019లో అజీమ్ తన పెళ్లి కోసం యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను స్వయంగా కలిసి సాయం కోరాడు. ప్రస్తుతం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు లేఖ కూడా రాశాడు. అన్నింటి సారాంశం ఒక్కటే... తనకో జీవిత భాగస్వామిని చూడాలన్నదే!

అంతకుముందు, ఓ పోలీసు అధికారి ఓ వీడియోలో 2 అడుగుల అజీమ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. "ఒక్కసారి అతడ్ని చూడండి... ఎంత స్మార్ట్ గా డ్రెస్ చేసుకున్నాడో! అతడ్ని పెళ్లి చేసుకోవడానికి ఏమిటి అభ్యంతరం?" అని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో మనవాడు మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు. తనకోసం పెళ్లిళ్ల పేరయ్యల్లా మారాలంటూ కోరాడు.


More Telugu News