మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్ తో కాదు.. బద్రుద్దీన్ అజ్మల్ పార్టీతోనే!: బీజేపీ

  • అసోంలో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ 
  • అసోం సంస్కృతిని బద్రుద్దీన్ నాశనం చేస్తున్నారన్న బీజేపీ
  • భారతీయతే బీజేపీ నినాదమని వ్యాఖ్య
అసోంకు కొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక వ్యాఖ్యలు చేసింది. అసోంలో తమకు ప్రధాన పోటీ  కాంగ్రెస్ తో కాదని... బద్రుద్దీన్ అజ్మల్ కు చెందిన ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్)తో అని వ్యాఖ్యానించింది. అసోం కేబినెట్ మంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ, లోక్ సభ ఎంపీగా ఉన్న అజ్మల్ అసోంకు ఎప్పుడూ ప్రమాదకరమే అని అన్నారు. అసోం సంస్కృతి, నాగరికతను అజ్మల్ నాశనం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం గమనార్హం.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, అసోం ఇన్ఛార్జి వైజయంత్ జే పాండా మాట్లాడుతూ, తమ ఉనికి కోసమే ఏఐయూడీఎఫ్ తో కాంగ్రెస్ జతకట్టిందని విమర్శించారు. అసోం బచావ్ అని కాకుండా... కాంగ్రెస్ బచావో అనే నినాదాన్ని ఆ పార్టీ ఎత్తుకోవాలని అన్నారు. అజ్మల్ ను దివంగత తరుణ్ గొగోయ్ మతతత్వవాది అనేవారని చెప్పారు. భారతీయతే బీజేపీ నినాదమని అన్నారు. అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలి విడత పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.


More Telugu News