నాగార్జున 'వైల్డ్ డాగ్' ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి

  • నాగ్ ప్రధాన పాత్రలో 'వైల్డ్ డాగ్'
  • ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మగా నాగ్
  • ఉగ్రవాద అంశాలతో తెరకెక్కిన చిత్రం
  • ముఖ్య పాత్రల్లో సయామీ ఖేర్, అలీ రెజా
  • ఏప్రిల్ 2న రిలీజ్ కానున్న 'వైల్డ్ డాగ్'
గతంలో హైదరాబాద్ ను వణికించిన గోకుల్ చాట్ పేలుళ్లు, ఇతర ఉగ్రవాద ఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'వైల్డ్ డాగ్'. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్  విజయవర్మ పాత్రలో కనిపిస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, 'నా సోదరుడు నాగ్ ఎప్పటిలాగానే కూల్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు' అంటూ కితాబునిచ్చారు. ఏ జానర్ లో ప్రయత్నించేందుకైనా నాగ్ వెనుకాడడని ప్రశంసించారు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

ఓ కంప్లీట్ యాక్షన్ మూవీకి ఉండాల్సిన కంటెంట్ వైల్డ్ డాగ్ లో ఉందని ఈ ట్రైలర్ చెబుతోంది. నూతన దర్శకుడు అహిషోర్ సాల్మన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో సయామీ ఖేర్, అలీ రెజా, ప్రకాశ్ సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి 'వైల్డ్ డాగ్' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది.

వాస్తవానికి ఈ సినిమాను కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటీటీ వేదికలపై రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు. అయితే, థియేటర్లలో పూర్తి సామర్థ్యం మేరకు ప్రేక్షకులను అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో థియేట్రికల్ రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.


More Telugu News