కొడుక్కి టికెట్ ఇచ్చిన స్టాలిన్.. తాత స్థానం నుంచి బరిలోకి దిగుతున్న ఉదయనిధి!

  • కుమారుడు ఉదయనిధిని ఎన్నికల బరిలోకి దింపిన స్టాలిన్
  • చెపాక్ స్థానంలో పోటీ చేస్తున్న ఉదయనిధి
  • ఈ స్థానం నుంచి మూడుసార్లు గెలుపొందిన కరుణానిధి
తమిళనాడు రాజకీయాల్లో మరో వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గతంలో ఉదయనిధి తాత, దివంగత కరుణానిధి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే స్థానంలో ఉదయనిధి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్టాలిన్ విషయానికి వస్తే, ఎప్పటి మాదిరే కొలతూరు స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.

ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా  ఉన్నారు. మూడేళ్ల క్రితమే ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చెపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గం తొలి నుంచి డీఎంకేకు కంచుకోటగా ఉంది. ఉదయనిధి ప్రస్తుతం ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి కరుణానిధి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

173 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను స్టాలిన్ ఈరోజు ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు పోటీగా తంగా తమిళ్ సెల్వన్ ను ఆయన బరిలోకి దించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, మార్చి 15వ తేదీన నామినేషన్లు వేస్తామని చెప్పారు. 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. ప్రతి డీఎంకే అభ్యర్థిని పార్టీ కార్యకర్తలందరూ కరుణానిధిగా భావించి, ఓటు వేయాలని కోరారు.


More Telugu News