తెలంగాణలో నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఫుల్‌స్టాప్.. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్

  • నేటి సాయంత్రం నాలుగు గంటలతో ముగియనున్న ప్రచారం
  • కోదండరాంకు చావో రేవో
  • పట్టుపెంచే ప్రయత్నాల్లో బీజేపీ
  • ఉనికి కోసం కాంగ్రెస్ పాట్లు
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం నాలుగు గంటలతో ప్రచారం ముగియనుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎదురైన పరాభవం వెంటాడుతుండడంతో అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్నికలు జరుగుతున్న ఆరు ఉమ్మడి జిల్లాల్లోని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను రంగంలోకి దించిన టీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేసింది.

మరోవైపు, వరుస పరాభవాలతో కుంగిపోతున్న కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల ద్వారా ఉనికి కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములు నాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక, రాష్ట్రంలో తమకు పెరుగుతున్న బలాన్ని మరింతగా పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ నుంచి ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిలు బరిలో ఉన్నారు. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు వారి తరపున ప్రచారం చేశారు.

అందరికంటే ముఖ్యంగా తెలంగాణ జనసమితి (టీజేఎస్)కి ఈ ఎన్నికలు చావోరేవో లాంటివి. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న ఆ పార్టీ చీఫ్ కోదండరాం ఖమ్మం నుంచి బరిలో ఉన్నారు. టీడీపీ, న్యూడెమోక్రసీ పార్టీలు ప్రత్యక్షంగానే మద్దతు ఇచ్చాయి. పార్టీ భవితవ్యం ఈ ఎన్నికల్లో ఆయన గెలుపోటములపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

ఈ స్థానం నుంచి మొత్తం 71 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలతోపాటు చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ వంటి వారు కూడా బరిలో ఉన్నారు. టీఆర్ఎస్‌కు ఇది సిట్టింగ్ స్థానం కావడంతో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రచారం సాగిస్తోంది.


More Telugu News